Japan | టోక్యో: జపాన్‌లో బియ్యం సంక్షోభం నెలకొంది. దేశంలో నిల్వలు అడుగంటాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. జపనీయుల సంస్కృతి, సంప్రదాయం, రాజకీయాలలో బియ్యంది కీలకమైన పాత్ర. దశాబ్దాలుగా బియ్యం వినియోగం తగ్గినప్పటికీ ఓవల్ ఆకారంలో ఉండే జిగట జపొనికా ధాన్యాన్ని ఆహారంగా భుజించడం ప్రజలు గర్వంగా భావిస్తారు. బియ్యం ధరలు సాపేక్షంగా ఎక్కువ ఉండటానికి బియ్యానికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం ప్రోత్సహించింది.
తద్వారా వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో వీటి ధరలు గత వేసవి నుంచి పెరగడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ కొరతను నివారించడానికి ప్రభుత్వం ఈ ఏడాది అత్యవసర బియ్యం నిల్వలను విడుదల చేసింది. అయితే ఈ నిల్వలు సూపర్మార్కెట్లకు మందకొడిగా చేరుకుంటుండటంతో బియ్యం నిల్వలు ఏవి అంటూ ప్రజలు నిలదీయడం ప్రారంభించారు.
ప్రజల ఒత్తిడి తట్టుకోలేక జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి టక్ ఇటో బుధవారం రాజీనామా చేశారు. కాగా, బియ్యం సమస్యపై దర్యాప్తు జరిపి దానిని పరిష్కరించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి షింజిరో కొయ్‌జుమి ఆదేశించారు. గత వేసవిలో పోలిస్తే బియ్యం ధర రెట్టింపైందని, ఆ ధరకు కొందామన్నా కూడా సూపర్ మార్కెట్లలో లభ్యం కావడం లేదని పౌరులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4 లక్షల టన్నుల కొరత ఉందని జపాన్ వ్యవసాయ సహకార సంఘాలు, వాణిజ్య హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అత్యంత కనిష్ఠానికి దిగజారి దేశంలో 15.3 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయని వారు చెప్పారు.