Canada Fireworks | కెనడాలో బాణాసంచాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో తొలుత పటాకుల అమ్మకాలను నిషేధించారు. అనంతరం గ్రేటర్ టోరంటో ఏరియాలోని పది పెద్ద నగరాల్లో కూడా అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఇతర నగరాల్లో కూడా బాణాసంచా అమ్మకాలు జరుపకుండా నిబంధనలు రూపొందించడంలో కెనడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కెనడా జనాభాలో దాదాపు 10 శాతం మంది భారతీయులు ఉన్నారు. పటాకుల అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీపావళితో పాటు కెనడా డే సందర్భంగా పటాకులు ఎక్కువగా కాల్చుతుంటారు. కొందరు కొత్త సంవత్సరం సందర్భంగా కూడా టపాసులు కాలుస్తుంటారు. అంటారియా ప్రావిన్స్‌లోని పెద్ద నగరమైన మిసిసాగాలో గత ఏడాది దీపావళి సందర్భంగా వివాదం చెలరేగింది. దాంతో అక్కడ పటాకుల అమ్మకాలను నిషేధించేందుకు కఠిన నిబంధనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అక్కడి అధికారులను ఆదేశించింది. గత ఏడాది బ్రాంప్టన్‌లో అర్ధరాత్రి వేళ బాణాసంచా కాల్చడంపై దాదాపు వేయికి పైగా ఫిర్యాదులు అందడంతో అక్కడ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
బాణాసంచా అమ్మకాలను తగ్గించేందుకు లైసెన్స్ ఫీజును ఒకేసారి పెద్ద మొత్తంలో పెంచడాన్ని కూడా అధికారులు యోచిస్తున్నారు. తాత్కాలిక దుకాణాల్లో 15 శాతానికి మించి బాణాసంచా ఉన్నట్లయితే భారీగా జరిమానా విధిస్తున్నారు. మిస్సిసాగా సిటీ కౌన్సిల్లో బాణాసంచా నిషేధ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత సంతతికి చెందిన కౌన్సిలర్ దీపికా దామెర్ల మాట్లాడుతూ.. ‘బాణాసంచా దీపావళిలో అంతర్భాగం. అవి లేకుండా పండుగ పూర్తవదు. బాణాసంచా హిందువుల సంస్కృతికి సంబంధించిన సున్నితమైన అంశమని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కొందరు తెల్లవారుజామున 3-4 గంటల వరకు పటాకులు కాల్చారు. ఇది మాత్రం తప్పు’ అని చెప్పారు.