న్యూఢిల్లీ : టర్కీ, సిరియాల్లో సోమవారం ఉదయం తలెత్తిన పెను ప్రకంపనలను మూడు రోజుల ముందుగానే ఓ వ్యక్తి ఊహించారని సోషల్ మీడియాలో వెల్లడైంది. భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్ఎస్జీఈఓఎస్)కు చెందిన పరిశోధకులు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ భూకంపాన్ని మూడు రోజుల ముందే అంచనా వేశారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో త్వరలో లేదా మున్ముందు రిక్టరు స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం సంభవిస్తుందని ఫ్రాంక్ హుగర్బీట్స్ ట్వీట్ చేశారు. అయితే ఆయన సూడో సైంటిస్ట్ అని, గతంలో ఆయన అంచనాలను ప్రశ్నిస్తూ పలువురు ట్విట్టర్ వేదికగా ఫ్రాంక్ అంచనాను ప్రశ్నించారు.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
ఈ ప్రాంతంలో ( దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్) 7.5 తీవ్రతతో భూప్రకంపనలు రానున్నాయని ఫిబ్రవరి 3న ఆయన ట్వీట్ చేశారు. తన అంచనా నిజం కావడంతో మరోసారి భారీ భూకంపం తలెత్తే అవకాశం లేకపోలేదని ఆయన అప్రమత్తం చేశారు. ఫ్రాంక్ హుగర్బీట్స్ అంచనాలను భూకంప శాస్త్రవేత్తలు అశాస్త్రీయం, తప్పుదారి పట్టించే అంచనా అని, ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేని ఊహాజనిత అంచనాగా కొట్టిపారేయడం గమనార్హం. కాగా, టర్కీ, సిరియాను కుదిపేసిన భారీ భూకంపం వందల మంది ఉసురుతీసింది. దక్షిణ టర్కీ కేంద్రంగా సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్లకు పైగా ధ్వంసం అయినట్లు టర్కీ ఉపాధ్యక్షుడు తెలిపారు. కాగా, భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూ ప్రకంపనల ధాటికి ఎత్తైన భవంతులు, ఇళ్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.రీ భూకంపం తర్వాత కూడా బలమైన భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొంది. కనీసం 18 సార్లు భూమి రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో కంపించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 640 మందికి పైగా మృత్యువాత పడగా.. వేలల్లో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.