వాషింగ్టన్ : అమెరికా సెనేట్లో రిపబ్లికన్లు మళ్లీ ఆధిక్యత సాధించారు. మంగళవారం జరిగిన ఎన్నికల తర్వాత డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ సభ్యుల సంఖ్య పెరిగింది. ఇలా జరగడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. నెబ్రాస్కాలో జరిగిన అనూహ్య పోరాటంలో రిపబ్లికన్లు అగ్ర స్థానానికి చేరుకున్నారు.
స్వతంత్ర అభ్యర్థి డాన్ ఓస్బోర్న్పై రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత సెనేటర్ దేబ్ ఫిషర్ విజయం సాధించారు. సెనేట్లో తమకుగల కొద్దిపాటి ఆధిక్యతను కాపాడుకోవడం కోసం డెమోక్రాట్లు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఫలితం దక్కలేదు.
రిపబ్లికన్ అభ్యర్థులు టెడ్ క్రూజ్ (టెక్సాస్), రిక్ స్కాట్ (ఫ్లోరిడా)లను ఓడించడానికి డెమోక్రాట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికా అధ్యక్షుని ఎజెండా అమలుకావాలంటే ప్రతినిధుల సభ, సెనేట్ మద్దతు అవసరం.