సియోల్, జనవరి 16: క్యాన్సర్ చికిత్స నియమాలను తిరగరాసే ఆవిష్కరణను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ కణాల స్వభావాన్ని.. వాటిని ధ్వంసం చేయకుండానే సాధారణ కణజాలంగా మార్చివేశారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధికి అందిస్తున్న చికిత్సలో కణితుల్లోని రోగకారక కణాలను ధ్వంసం చేస్తారు. దీంతో వాటి సమీపంలోని ఇతర ఆరోగ్యకరమైన టిష్యూ సైతం ప్రభావితమవుతుంది. ఈ నేపథ్యలో వ్యాధిగ్రస్తమైన కణాలను రేడియేషన్ లేదా కీమోథెరపీతో ధ్వంసం చేయకుండా పరిశోధకులు వాటిని సాధారణ కణజాలంలాగా ప్రవర్తించే విధంగా రీప్రోగ్రామింగ్ చేశారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌పై జరిపిన ఈ విజయవంతమైన ప్రయోగంలో కణితులు ధ్వంసం కాకపోగా అవి విమోచించబడ్డాయని పరిశోధకులు పేర్కొన్నారు. తమ పరిశోధన వివరాలను అడ్వాన్స్డ్ సైన్స్ మ్యాగజైన్లో ప్రచురించారు.
ఈ పరిశోధనకు కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్వాంగ్ హ్యూన్ చో నేతృత్వం వహించారు. కణజాలాల పరివర్తనకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన డిజిటల్ ట్విన్ అనే శక్తిమంతమైన గణన నమూనాను ఉపయోగించారు. ప్రస్తుతం సంప్రదాయ పద్ధతుల్లో జరుపుతున్న క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ లేదా కీమోథెరపీ వల్ల వ్యాధిగ్రస్తమైన కణాలకు సమీపంలో ఉండే ఆరోగ్యకరమైన కణజాలం కూడా ప్రభావితమవుతున్నది. దీంతో రోగిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీనిని నివారించడానికి చో బృందం ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నది. క్యాన్సర్ కణాలు నియంత్రించలేని స్థాయిలో పెరుగకుండా వాటిని వేరుచేసి, భిన్నమైన, స్థిరమైన మా ర్పుకు గురిచేసే పద్ధతిని కనుగొన్నది. ఒక కణం ప్రాణాంతకంగా లేదా సాధారణంగా ప్రవర్తించే విధంగా నియంత్రించే కీలక జన్యు నియంత్రకాలను బెనైన్ అనే పద్ధతి ద్వారా గుర్తించారు.