Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో దాచుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో ఆయన ప్రాణాలకు ముప్పున్న నేపథ్యంలో బంకర్లోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. అయితే, ఎవరూ అనుకోని విధంగా ఆయనకు ఏమైనా హాని జరిగితే.. తన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించాలో నిర్ణయం తీసుకున్నారని అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ముగ్గురు సీనియర్ మతాధికారుల పేర్లను ఖరారు చేసినట్లు పేర్కొంది. అలీరేజా అరాఫీ, అలీ అస్గర్ హెజాజీ, హషీం హుస్సేని బుషారీల్లో ఎవరో ఒకరు సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలియకుండా వివరాలో గోప్యంగా ఉంచాలని.. తనకు దగ్గరలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర యుద్ధ ప్రణాళిక నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా ఖమేనీ వారసుడిగా మోజ్తాబా ఖమేనీ పేరు సైతం వినిపించింది. తాజాగా ఆయన ఎంపిక చేసిన పేర్లలో తనయుడి పేరు కనిపించలేదు. వాస్తవానికి వారసత్వ రాజకీయాలకు ఖమేనీ పూర్తిగా వ్యతిరేకం.
గతంలో కుటుంబ పాలకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలోనే స్పందించడం ప్రస్తావనార్హం. ఇదిలా ఉండగా గతంలో ఖమేనీ వారసుడిగా మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పేరు బాగా వినిపించింది. కానీ, ఆయన గతేడాది జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఘాటుగా స్పందించారు. ఖమేనీ ఇక బహిరంగంగా బయటకు రాలేడని.. బంకర్లో దాక్కొని ఇజ్రాయెల్ ఆసుపత్రులపై దాడులకు ఆదేశిస్తున్నాడని ఆరోపించారు. ఇది యుద్ధ నేరమని.. ఖమేనీ దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఖమేనీని లక్ష్యంగా చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.