రోమ్, నవంబర్ 6: ఇటలీలోని పురాతన నగరం పాంపేలో జరిపిన తవ్వకాల్లో 2 వేల ఏండ్ల నాటి ‘బానిస గది’ ఆనవాళ్లు లభించాయి. ఆ చిన్న గదిలో మూడు మంచాలు, మట్టికుండ, చెక్క బీరువా తదితర వస్తువులు ఉన్నాయి. 2 వేల ఏండ్ల క్రితం ఓ అగ్నిపర్వతం బద్దలై ఈ నగరాన్ని మింగేసింది. సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిలేకపోయిన వారు ఆ విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మొదట్లో ఇదే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఓ రథం బయల్పడింది. దాన్ని బట్టి రథాల నిర్వహణ పని అప్పగించిన బానిసలు ఈ గదిలో ఉండేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దానికి వాడే సామగ్రిని చెక్క బీరువాలో గుర్తించారు. వేల ఏండ్ల క్రితం బానిసల జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఈ గది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.