టెహ్రాన్, జూన్ 20: కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ ఖతమ్ అల్-అన్బియా ప్రధాన కార్యాలయం శనివారం ప్రకటించినట్లు మెహర్ వార్తాసంస్థ తెలిపింది. అమెరికా విశ్వాస ఘాతుకం, లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ నిరంతరం ఉల్లంఘించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగానే ఈ మూసివేత చర్యను చేపట్టినట్లు ఇరాన్ సైనిక కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
తమ ప్రతిస్పందనలో ఇది మొదటి అడుగుగా ఇరాన్ అభివర్ణించింది. తాము దురాక్రమణగా పేర్కొంటున్న ఈ చర్యలు కొనసాగితే మరిన్ని చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి నిబంధనలో పొందుపరిచిన హామీలను ఇటీవలి పరిణామాలు ఉల్లంఘించాయని ఇరాన్ భావిస్తున్నట్లు ప్రకటన పేర్కొన్నది. కాగా, ఆ తర్వాత ఒక ప్రకటనలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) హొర్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకా రవాణాకు మూసివేసినట్లు ప్రకటించింది. ఈ జలమార్గం వైపు నౌకలు రావద్దని హెచ్చరిస్తూ అలా చేస్తే వాటి భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని పేర్కొన్నది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులు 32 మందిని బలిగొన్నాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. అనిశ్చితిలో ఉన్న శాంతి ఒప్పందాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ చర్యలు ఆటంకం కల్పిస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే జిల్లాపై శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 16 మంది మరణించారని, 12 మంది గాయపడ్డారని లెబనాన్ పౌర రక్షణ సంస్థ తెలిపింది. సిడాన్ జిల్లాలోని ఖనారిట్పై ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో ఏడుగురు మరణించారని, 13 మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇలా ఉండగా, శుక్రవారం జరగాల్సిన చర్చలు వాయిదా పడటంతో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ స్విట్జర్లాండ్‌కు రానున్నారని శుక్రవారం అమెరికా మీడియా పేర్కొన్నది. అయితే లెబనాన్‌లో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధులు ఎప్పుడు హాజరవుతారనేది అస్పష్టంగా ఉన్నది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం స్విస్‌కు వెళ్లనున్నారని ఆక్సియోస్ పేర్కొన్నప్పటికీ ఆయన పర్యటన వాయిదాపడవచ్చని ఇతర వర్గాలు తెలిపాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల్లోని ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం దౌత్య ప్రక్రియకు లెబనాన్‌లో కాల్పుల విరమణ అత్యంత ఆవశ్యకమని, అది అమెరికా-ఇరాన్ చర్చల ఫలితాన్ని నిర్ణయించగలదని అరాఘ్చీ పలువురు సహచరులతో అన్నారు. స్విట్జర్లాండ్‌కు వెళ్లే ముందు కాల్పుల విరమణ అమలవ్వాలని ఇరాన్ అధికారులు కోరుకుంటున్నారని మరో వర్గం తెలిపింది.
యూఎస్ వైమానిక దళానికి చెందిన కొత్త వీసీ-25బీ బ్రిడ్జ్ విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దానిని ‘ఎగిరే వైట్ హౌస్’గా అభివర్ణించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తదుపరి తరం ఎయిర్‌ఫోర్స్ వన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ సవరించిన బోయింగ్ 747 తాత్కాలిక అధ్యక్ష విమానంగా సేవలు అందజేస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఊహించని విధంగా ఖతార్ రాజకుటుంబం ఈ విమానాన్ని అమెరికాకు బహుమతిగా అందజేసింది. సుమారు 400 మిలియన్ డాలర్లు (రూ. 3,820 కోట్లు) విలువ చేసే ఈ 747-89 బోయింగ్ విమానం ఒక దేశం అమెరికాకు ఇవ్వడం ఇదే తొలిసారి.