బీజింగ్ : పిల్లల పెంపకానికి అత్యధిక ఖర్చు అవుతున్న దేశాల జాబితాలో చైనా రెండో స్థానంలో నిలిచింది. దీంతో పిల్లలను పెంచే జంటలకు అండగా నిలవాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో ఒక బిడ్డను పెంచేందుకు తలసరి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.9 శాతం ఖర్చవుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలిందని యువా పాపులేషన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొన్నది.
దక్షిణ కొరియాలో పిల్లల పెంపకం ప్రపంచంలోనే అత్యంత వ్యయభరితంగా ఉన్నదని, ఆ దేశంలో ఒక బిడ్డను 18 ఏండ్ల వయసు వరకు పెంచేందుకు తలసరి జీడీపీ కంటే 7.79 రెట్ల ఖర్చవుతున్నదని తెలిపింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా, చైనా తర్వాత జర్మనీ (తలసరి జీడీపీ కంటే 3.64 రెట్లు), ఫ్రాన్స్ (తలసరి జీడీపీ కంటే 2.24 రెట్లు), ఆస్ట్రేలియా (తలసరి జీడీపీ కంటే 2.08 రెట్లు) ఉన్నట్టు వివరించింది. పిల్లల పెంపకం ఖర్చును భరించలేకే చాలా కుటుంబాలు సంతాన భాగ్యాన్ని పొందేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదట.