వాషింగ్టన్, ఆగస్టు 26: అమెరికాలో జాత్యహంకారం పెట్రేగిపోతున్నది. జాతి వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు అమెరికన్ భారతీయులను ఓ మెక్సికన్ అమెరికన్ తీవ్రంగా దూషించడంతో పాటు వారిపై దాడికి పాల్పడింది. తిరిగి భారత్కు వెళ్లిపోండంటూ వీరంగం సృష్టించింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దాడి చేసిన మెక్సికన్ మహిళను ఎస్మలార్డా ఆప్టన్గా గుర్తించిన పోలీసులు అమెను గురువారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. డల్లాస్లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
‘నేను భారతీయులను ద్వేషిస్తాను. ఇండియాలో బెటర్ లైఫ్ లేకపోవడం వల్లే మీరంతా అమెరికా వస్తున్నారు. తిరిగి మీదేశానికి వెళ్లిపోండి’ అం టూ ఎస్మలార్డా రెచ్చిపోయింది. అమెరికాలో ఎక్కడికి వెళ్లినా..భారతీయులే కనిపిస్తున్నారని అంటూ కేకలువేస్తూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.