మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ భారతీయ పౌరుడిని మోకాలితో తొక్కిపెట్టి చంపిన ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. అడిలైడ్‌లో ఒక పార్కింగ్ వివాదంలో చరణ్‌ప్రీత్ సింగ్(23) అనే భారతీయ విద్యార్థిపై ఈ నెల 19న జాత్యహంకార దాడి జరిగింది. తనపై దాడి చేసే ముందు ‘వెళ్లిపో.. ఇండియన్’ అని వారు తనపై అరిచారని.. ఆ తర్వాత తనపై పిడిగుద్దులు కురిపించారని బాధితుడు తెలిపాడు. తాను వారితో పోరాడేందుకు ప్రయత్నించినా.. తాను స్పృహ తప్పే వరకు వారు తనని కొట్టారని అతడు వాపోయాడు.
ఈ దాడిలో బాధితుడి ముఖానికి, మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరోవైపు, మెల్బోర్న్ శివార్లలోని బొరొనియాలోని ఓ హిందూ దేవాలయంపైనా దాడి జరిగింది. ఆస్త్రేలియన్ దిన పత్రికల కథనం ప్రకారం.. ‘ఈ నెల 21న ‘గో హోమ్ బ్రౌన్ (స్వదేశానికి వెళ్లిపోండి)’ అంటూ జాత్యహంకార రాతలు శ్రీ స్వామినారాయణ్ దేవాలయంపై కనిపించాయి. గుడికి దగ్గరలో ఆసియా వాసులు నిర్వహించే రెండు హోటళ్లపైనా ఈ రాతలను గుర్తించారు. మౌంటెన్ హైవేలోని స్వస్థత కేంద్రం గోడలపైనా అదే రోజు రాత్రి ఈ తరహా రాతలు అగుపించాయి.
డబ్లిన్: ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఈ నెల 19న 40 ఏండ్ల భారతీయుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బాధితుడు ప్రస్తుతం టల్లాట్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దాడిపై ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ…‘వాళ్లు అతడి దుస్తులన్నీ చించేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్, బ్యాంక్ కార్డులతో పాటు అన్నీ దోచుకున్నారు. చచ్చేటట్టు తీవ్రంగా కొట్టారు’ అని చెప్పారు.
తాను గంట సేపు అతడితోనే ఉన్నానని.. ముక్కు, తల నుంచి రక్తం కారుతున్న అతడు దాడి పట్ల దిగ్భ్రాంతిలో ఉండిపోయాడని ఆమె చెప్పారు. దాడి ఘటనను స్థానిక భారత రాయబారి ఖండించారు.