Quantum Sensor | సిడ్నీ, డిసెంబర్ 25 : ద్రాక్ష పండ్లపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే సాధారణ ద్రాక్ష పండ్లు క్వాంటమ్ సెన్సర్ పనితీరును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ద్రాక్ష జతలు మైక్రోవేవ్‌ల కోసం స్థానికీకరించిన అయస్కాంత క్షేత్ర హాట్స్పాట్లను ఉత్పత్తి చేస్తాయని, తక్కువ ఖర్చుతో చిన్న పరిమాణంలో ఉన్న క్వాంటమ్ సెన్సర్లను అభివృద్ధి చేసేందుకు ఇవి సహాయపడతాయని తమ అధ్యయనంలో తేలినట్టు సిడ్నీ లోని మాక్క్వెయిరీ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ద్రాక్షలు మైక్రోవేవ్ ఒవెన్‌లలో ప్లాస్మాను, మెరుస్తున్న చార్జ్డ్ కణాలను ఉత్పత్తి చేస్తున్న దృశ్యాలతో వారు రూపొందించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ప్లాస్మా ప్రభావాన్ని కలిగించే విద్యుత్తు క్షేత్రాలపై గత అధ్యయనాల్లో దృష్టి సారించినప్పుడు ద్రాక్ష జతలు సైతం అయస్కాంత క్షేత్రాల బలాన్ని రెట్టింపు చేయగలవని రుజువైందని, క్వాంటమ్ సెన్సింగ్ అప్లికేషన్లకు ఇవి ఎంతో కీలకమైనవని మాక్ క్వెయిరీ యూనివర్సిటీ క్వాంటమ్ ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి అలీ ఫవాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.