వాషింగ్టన్, ఫిబ్రవరి 14: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ యుద్ధం నుంచి పుతిన్ వెనక్కి తగ్గితే ఆయనను హత్యచేసే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటారని అన్నారు. ‘ఎక్స్ స్పేసెస్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో సోమవారం రిపబ్లికన్ పార్టీ సెనెటర్లతో జరిగిన చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తుందని భావిస్తున్నవారంతా ఊహా లోకంలో జీవిస్తున్నారన్న విస్కాన్సిన్ సెనెటర్ రాన్ జాన్సన్ అభిప్రాయంతో మస్క్ ఏకీభవించారు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, మరింత దీర్ఘకాలంపాటు యుద్ధం కొనసాగడం ఉక్రెయిన్‌కే నష్టమని పేర్కొన్నారు. గతంలో ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు తనను చాలా మంది విమర్శించారని మస్క్ గుర్తుచేస్తూ.. వాస్తవాలను తెలుసుకోవాలని విమర్శకులకు సూచించారు.