మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ సర్జరీకి సిద్ధమైనట్లు తెలుస్తున్నది. దీంతో ఆ దేశ నిఘా సంస్థ అయిన కేజీబీ మాజీ చీఫ్, 70 ఏండ్ల నికోలాయ్ పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని ఆయన అప్పగిస్తారంటూ వార్తలొస్తున్నాయి. రష్యా భద్రతా మండలిలో ప్రస్తుత కార్యదర్శి అయిన పట్రుషెవ్, యుద్ధ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం పుతిన్‌ను ఆయనే ఒప్పించినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీతోపాటు అనంతరం పుతిన్ కోలుకునే స్వల్ప కాలం వరకు రష్యా పగ్గాలతోపాటు ఉక్రెయిన్‌పై యుద్ధ కార్యాచరణ పట్రుషెవ్ చేతుల్లో ఉంటాయని తెలిపింది.
అయితే రష్యా రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని ప్రధాన మంత్రికి మాత్రమే అప్పగించాలి. దీనికి బదులుగా తనకు నమ్మకస్తుడైన పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని పుతిన్ అప్పగించనుండటం ఆశ్చర్యకరమైన సంగతని డైలీ మెయిల్ పేర్కొంది. ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ జనరల్ ఎస్వీఆర్ కూడా క్యాన్సర్ సర్జరీకి పుతిన్ సిద్ధమైనట్లు తెలిపింది. సాధారణంగా అధికార బదిలీకి పుతిన్ ఒప్పుకోరని, అయితే శస్త్రచికిత్స నేపథ్యంలో కేవలం రెండు మూడు రోజులు పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని ఆయన అప్పగిస్తారన్నది సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు పేర్కొంది.
కాగా, పుతిన్ గత ఏడాదిన్నరగా ఉదర క్యాన్సర్‌తోపాటు పార్కిన్సన్తో బాధపడుతున్నారు. అయితే ఉదర క్యాన్సర్‌కు తప్పనిసరిగా చేయించు కోవాల్సిన శస్త్రచికిత్స వాయిదా పడుతూ వస్తున్నది. ఏప్రిల్ 15 తర్వాత శస్త్రచికిత్సకు తొలుత షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్ని గుర్తు చేసుకునే విక్టరీ డేను మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో నిర్వహించనున్నారు. దీంతో దీని తర్వాతే పుతిన్‌కు శస్త్రచికిత్స జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా దాడులను రష్యా మరింత తీవ్రం చేయనున్నట్లు తెలుస్తున్నది.