Gurdeep Singh : అమెరికాలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమెరికా, న్యూయార్క్ నగరంలో శుక్రవారం జరిగింది. మృతుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, కపుర్తాలా జిల్లాలోని జబోవాల్ గ్రామానికి చెందిన గుర్దీప్ సింగ్ 2017లో అమెరికా వెళ్లాడు. అతడు డంకీ రూట్లో, అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. ఇందుకోసం భారీగా అప్పు చేశాడు.
మంచి జీవితం కోసం వెళ్లిన అతడు చివరకు అక్కడ పిజ్జా డెలివరీ పార్ట్నర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్తుండగా, బ్రూక్లిన్ వద్ద అతడిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. స్తానిక కాలమానం ప్రకారం రాత్రి 10.00 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పులపై పోలీసులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు స్థానికులు సమాచారం అందించారు. వారు వచ్చి, గాయాలతో పడి ఉన్న గుర్దీప్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన సమయంలో తాము ఆరు రౌండ్ల కాల్పుల శబ్దం విన్నామని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరా దృశ్యాల్ని పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో గుర్దీప్ సింగ్‌కు, మరో వ్యక్తికి గొడవ జరగడం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరి మధ్య రోడ్డుపై వాగ్వాదం జరగడంతో, ఓ వ్యక్తి గుర్దీప్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, అది దోపిడీ ఘటనా.. లేక రోడ్డుపై వాహనాలకు సంబంధించి జరిగిన గొడవా అనేది తేలాల్సి ఉంది.
లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా అతడిని పోలీసులు పట్టుకోలేదు. నిందితుడిని పట్టుకుని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్తానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ‘ద నార్త్ అమెరికన్ పంజాబి అసోసియేషన్’ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలని, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేసింది.