Bulldozer strikes | నిన్న మొన్నటి వరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఎదుటిపక్షం వారి ఇళ్లను కూల్చివేసిన బుల్డోజర్.. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌కు చేరింది. కశ్మీర్లో పుల్వామా ఘటన నిందితుడి ఇల్లును ధ్వంసం చేశారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం శనివారం ఈ కూల్చివేతకు సిద్ధపడింది. ఈ ఇంట్లో ఉండే ఉగ్రవాది పీఓకేకు పారిపోగా.. ఆ ఇంటిలో ప్రస్తుతం ఎవరూ ఉండటం లేదు.
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని రాజౌరీలో పాకిస్తాన్ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఆషిక్ నెన్‌గ్రూ ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చివేసింది. ఆషిక్ నెన్‌గ్రూ పుల్వామా ఘటన నిందితుడి ఉన్నారు. గతంలో ఓ టన్నెల్ ద్వారా పాకిస్తాన్‌కు పారిపోయిన ఆషిక్.. పీఓకేలో ఉంటూ భారత భూభాగంపై ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఇంటిని కట్టుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
అనేక ఉగ్ర దాడుల్లో ఆషిక్ పాల్గొన్నట్లు కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు పేర్కొంటున్నాయి. భారత ప్రభుత్వం జారీ చేసిన ఉగ్రవాద జాబితాలో నెన్‌గ్రూ పేరును కూడా చేర్చారు. ఆషిక్ ఇల్లు కూల్చివేత చర్యతో ఉగ్రవాదులు, వారికి సహాయపడేవారికి ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఉగ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా, సాయపడినా ఇలాంటి కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.