వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్లీ రివోక్డ్’ ఈ-మెయిల్స్ వస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో గతంలో పడినవారికి ఇటువంటి ఈ-మెయిల్స్ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకుముందు వీసా స్టాంప్స్లోనే వెల్లడించి, క్లియర్ చేసినప్పటికీ ఈ నోటీసులు వస్తున్నాయి. హెచ్-1బీ, హెచ్-4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు.
అయితే, గతంలో పేర్కొన్న సమస్యను తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో మళ్లీ పునఃపరిశీలిస్తామని చెప్పడమే ఈ నోటీసుల అంతరార్థం. హూస్టన్‌లోని ఇమిగ్రేషన్ లా ఫర్మ్ రెడ్డి న్యూమన్ బ్రౌన్ పీసీ తెలిపిన వివరాల ప్రకారం, అర్హతకు సంబంధించిన సమస్యలు కనిపించినపుడు ప్రుడెన్షియల్ వీసా రివొకేషన్ను జారీ చేస్తారు. ఇది తుది నిర్ణయం తీసుకుని జారీ చేసేది కాదు. వీసా స్టేటస్ ఎక్స్పైర్ అయ్యే వరకు ఇటువంటివారు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. అయితే, వీరు విదేశాలకు వెళ్లినట్లయితే, వీసా స్టాంప్ చెల్లుబాటు కొనసాగుతున్నప్పటికీ, తిరిగి అమెరికాలో ప్రవేశించేందుకు అవకాశం ఉండదు.
భారతీయులపై ప్రభావం
‘ప్రుడెన్షియల్ రివొకేషన్’ నోటీసుల ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడవచ్చు. హెచ్-1బీ, హెచ్-4 వీసాదారుల్లో భారతీయులే అత్యధికులు. వీరిలో ఇప్పటికే అమెరికాలో ఉన్నవారు యథాతథంగా చట్టబద్ధంగా కొనసాగుతూ, పని చేసుకోవచ్చు. ఈ నోటీసుల వల్ల ట్రావెల్ ప్లాన్స్ దెబ్బతింటాయి. ఈ నోటీసులు పొందినవారు తిరిగి అమెరికాలో ప్రవేశించడం సాధ్యంకాకపోవచ్చు. దీంతో ఇండియన్ ప్రొఫెషనల్స్, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.