రోమ్: పాలస్తీనా అనుకూల ఆందోళనలతో ఇటలీ (Italy) అట్టుడికింది. పాలస్తీనాను (Palestine) ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ సహా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి. పాలస్తీనా జెండాలతో రోడ్లపైకి వచ్చిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసన కారులు షాపుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో 60 మంది పోలీసులు గాయపడ్డారు. 10 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించిన ఇటలీ.. ఐక్యరాజ్యసమితిలో (UN) జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా ఓటు వేసింది. అయితే ఆ నిర్ణయాన్ని ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి పాలస్తీనాను అధికారికంగా గుర్తించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు దేశవ్యాప్తంగా స్ట్రైక్‌కు పిలుపునిచ్చారు. అన్నిటినీ బ్లాక్ చేయండి (Let’s Block Everything) అనే నినాదంతో ఆందోళనలకు దిగారు. రోమ్‌తోపాటు జనోవా, లివర్నో, ట్రీస్టే నగరాల్లోని ఓడరేవుల్లో కార్మికులు నిరసన తెలిపారు. వెనీస్ ఓడరేవు వద్ద ప్రదర్శన కారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ క్యానన్ (నీటి ఫిరంగి) లను ఉపయోగించారు. బొలాంగాలో జాతీయ రహదారిని ఆందోళన కారులు దిగ్భందించారు. వాహనాలను అడ్డుకున్నారు. రోమ్‌లో రైల్వే స్టేషన్ వెలుపల వేలాది మంది బైఠాయించారు. కాగా, దేశవ్యాప్తంగా జరిగుతున్న ఆందోళనలపై ప్రధాని మెలోని ఆగ్రమం వ్యక్తం చేశారు. హింసను సిగ్గుచేటుగా అభివర్ణించారు.