Russia Pregnants | రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని గర్భిణులు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా రష్యా గర్భిణులు కాన్పు సమయం దగ్గరపడగానే వారు తమ మాతృదేశం వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది గర్భిణులు రష్యా నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లినట్లు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితం ఒక్కరోజే 33 మంది గర్భిణులు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్కు చేరుకున్నారు. వీరంతా కాన్పుకు దగ్గరగా ఉన్నవారే. నిజానికి వీరంతా రష్యాలో యుద్ధం మధ్యలో బిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. మరోవైపు, అర్జెంటీనాలో కాన్పు జరిగితే పుట్టిన బిడ్డతో పాటు తల్లిదండ్రులకు అక్కడి పౌరసత్వం లభించడం సులభంగా ఉంటుంది.
తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం అర్జెంటీనాకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొందాలని తాపత్రయపడుతున్నట్లు ఓ గర్భిణీ తెలిపింది. ఈ గర్భిణుల వలసలకు బర్త్ టూరిజం అని పేరు పెట్టారు. వీసా రహిత ప్రవేశం, మంచి వైద్య సేవలు పొందవచ్చన్న సాకుతో గర్భిణులు అర్జెంటీనాను ఎంచుకుంటున్నారు. అర్జెంటీనాలో వసతి, శిశువు డెలివరీపై ఆఫర్ల కోసం రష్యాలో ఒక వెబ్సైట్ కూడా ఉన్నది. ఈ వెబ్సైట్ బర్త్ ప్లాన్లు, ఎయిర్పోర్ట్ పిక్-అప్, అలాగే స్పానిష్ భాషా తరగతులు, బ్యూనస్ ఎయిర్స్‌లోని ఉత్తమ దవాఖానాల్లో చికిత్సల ప్యాకేజీలను అందిస్తున్నది.
అర్జెంటీనా పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తులు వీసా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 171 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. రష్యా పాస్‌పోర్ట్ ద్వారా 87 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు. ఇలా ఉండగా, రష్యన్ మహిళలు నకిలీ పాస్‌పోర్ట్‌లతో అర్జెంటీనాలో ప్రవేశించడానికి సహాయపడే ముఠాలపై అర్జెంటీనా పోలీసులు నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ ముఠాలు ఇలాంటి సేవలకు దాదాపు రూ.29 లక్షలు వసూలు చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేయలేదు. కానీ ల్యాప్‌టాప్, నగదు, ఇమ్మిగ్రేషన్ పత్రాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు.