హైదరాబాద్: భానుడిలో భారీ విస్పోటనంతో.. భూమిపైకి సౌర తుఫాన్ దూసుకువస్తోంది. జనవరి 30వ తేదీన సూర్యుడిపై ఆ స్టార్మ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఆ సౌర తుఫాన్ భూ ఉపరితలాన్ని తాకే అవకాశం ఉంది. సూర్యుడిలోని ఏఆర్2936 ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. దీని ద్వారా కరోనల్ మాస్ ఎజెక్షన్ రిలీజై అయినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి రేపు తెల్లవారుజామ వరకు ఆ భానుడి భగభగలు భూమికి చేరే అవకాశాలు ఉన్నట్లు కోల్కతాకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొన్నది. అయితే ఆ సౌర తుఫాన్ ప్రభావం సాధారణంగా ఉండనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా స్వల్ప, మధ్య తరహా మార్పులు గమనించే అవకాశాలు ఉన్నాయి. నాలుగు గంటల పాటు సూర్యుడిలో కలిగిన సౌర విస్పోటనంతో.. జీ2 క్లాస్ గురుత్వాకర్షక తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తుఫాన్ వల్ల రెండు ద్రువాల్లోనూ ఆరాలు కనిపించే వీలుంది.