వాటికన్: రోమ్‌లోని గిమేలీ ఆస్పత్రిలో పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) పదో రోజు గడిపారు. డబుల్ నుమోనియాతో బాధపడుతున్న ఆయనకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. హోలీ సీ ప్రెస్ ఆఫీసు ప్రకారం.. ఆస్పత్రిలో పోప్ ఫ్రాన్సిస్ పదో రోజు ప్రశాతంగా గడిపినట్లు చెప్పారు. ప్రస్తుతం పోప్ రెస్ట్ తీసుకుంటున్నారని ఆ ఆఫీసు తన ప్రకటనలో పేర్కొన్నది. గిమేలీ ఆస్పత్రిలో డబుల్ నుమోనియాకు చికిత్స జరుగుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఆదివారం కూడా పోప్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా.. ఆయనకు శనివారం ఉదయం నుంచి ఎటువంటి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తలేదని వెల్లడించారు. హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచేందుకు పోప్ ఫ్రాన్సిస్‌కు రక్తం ఎక్కించినట్లు తెలుస్తోంది.
థ్రాంబోసైటోపీనియా ప్రస్తుతం నిలకడగా ఉందని, కొన్ని పరీక్షల ద్వారా ఆయనకు మూత్రాశయ సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం అన్నీ అదుపులోనే ఉన్నట్లు ఆ స్టేట్మెంట్లో వెల్లడించారు. నాసిక రంద్రాల ద్వారా హై ఫ్లో ఆక్సిజన్ థెరపీ జరుగుతున్నట్లు చెప్పారు. ఆదివారం గిమేలీ ఆస్పత్రిలో తన రూమ్‌లోనే పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులతో ఆయన ప్రార్థనలు నిర్వహించారు. తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్‌ను ఫిబ్రవరి 14వ తేదీన గిమేలీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.