న్యూయార్క్: అమెరికాలోని న్యాయార్క్ బ్రూక్లిన్ సబ్వేలో కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫ్రాంక్ ఆర్ జేమ్స్ (Frank R James) అనే 62 ఏండ్ల వ్యక్తి కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు. ఈమేరకు అనుమానితుడి ఫొటోను న్యూయార్క్ పోలీస్ కమిషనర్ కీచాంట్ సెవెల్ విడుదల చేశారు. నిందితుడిని పట్టించినవారికి 50 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. కాల్పుల ఘటనలో 10 మంది గాయపడ్డారని, మరో 13 మందికి తొక్కిసలాటలో గాయాలయ్యాయని చెప్పారు.
న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో 23 మంది గాయపడ్డారు. కాల్పులు జరుపడానికి ముందు నిందితుడు స్మోక్ పరికరంతో స్టేషన్లో పొగ కమ్ముకునేలా చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు నిర్మాణరంగ కార్మికుడి అంగీ వేసుకుని, గ్యాస్ మాస్కు ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.