వార్సా, సెప్టెంబర్ 10: రష్యాకు చెందిన డ్రోన్లను కూల్చివేశామని పోలండ్ బుధవారం ప్రకటించింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ నాటో దేశం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన వైమానిక దాడిలో 19 డ్రోన్లు తమ గగనతలంలోకి వచ్చాయని, వాటితో తమకు ముప్పు ఉండటంతో వెంటనే కూల్చివేశామని పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. తాము భారీ స్థాయిలో రెచ్చగొట్టుడు చర్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇటువంటి చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పోలండ్ ఆరోపణలు ఆధారరహితమని రష్యా దౌత్యవేత్తను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ పేర్కొంది.
పోలండ్ కూల్చివేసినవి రష్యాకు చెందిన డ్రోన్లేనని చెప్పడానికి ఎటువంటి ఆధారాలను ఆ దేశం చూపలేదని తెలిపింది. రష్యా చర్యను పలు యూరోపియన్ అధికారులు ఖండించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చిన డ్రోన్లను కూల్చివేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉన్నదని టస్క్ అభిప్రాయపడ్డారు. తాజా ఘటనతో ఐరోపా దేశాలు రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఆ దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రష్యా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ పోలండ్ గగనతలంలోకి చొరబడిందని నాటో చీఫ్ మార్క్ రూటే వ్యాఖ్యానించారు.