Professional Parents | బీజింగ్: చైనాలోని సంపన్నుల్లో కొత్త పోకడ పుట్టుకొచ్చింది. కెరీర్లో ఎదుగుదలపై దృష్టి పెట్టే సంపన్నులైన తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం బాధ్యతలను ‘ప్రొఫెషనల్ పేరెంట్స్’కు అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులుగా తాము చేయాల్సిన పనులను ఈ నిపుణుల చేత చేయిస్తున్నారు. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థి ఒకరు వందలాది మంది ప్రొఫెషనల్ పిల్లల పెంపకందారులను ఇంటర్వ్యూ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నవారిలో అత్యధికులు హార్వర్డ్, కేంబ్రిడ్జ్, త్సింఘువా, పెకింగ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందినవారేనని చెప్పారు. వీరిలో కొందరు బాలల మానసిక శాస్త్రంలో ప్రత్యేక నైపుణ్యం సాధించినవారని, మరికొందరు మాస్టర్స్ డిగ్రీ, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు కలవారని తెలిపారు.
ప్రొఫెషనల్ చైల్డ్ కంపేనియన్గా నియమితులైనవారు తమ యజమాని పిల్లలను బడికి తీసుకెళ్లడం, అవసరమైనపుడు దవాఖానకు తీసుకెళ్లడం, హోమ్‌వర్క్ చేయించడం, ఆడించడం వంటి పనులు చేస్తారు. వీరికి నెలకు జీతం రూ.1,17,000 నుంచి రూ.3,43,000 వరకు ఉంటుంది. ‘ప్రొఫెషనల్ అమ్మ’లకు డిమాండ్ బాగా ఉంది. ప్రొఫెషనల్ నాన్నలకు డిమాండ్ తక్కువగా ఉంది. మగ పిల్లల కోసమే ప్రొఫెషనల్ నాన్నలను నియమించుకుంటున్నారు.
అమెరికాలో కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
వాషింగ్టన్, ఆగస్టు 17: అమెరికాలో దోపిడీ, తుపాకీ కాల్పుల ఘటనలకు భారత సంతతి పౌరులు బలవుతున్నారు. ఉత్తర కరోలినాలో ఓ టొబాకో స్టోర్‌ను నడుపుతున్న మైనాక్ పటేల్ (36)పై దొంగతనానికి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో మైనాక్ పటేల్ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
మైనాక్ పటేల్‌కు భార్య, 5 ఏండ్ల కూతురు ఉన్నారు. వందలాది మంది స్థానికులు టొబాకో స్టోర్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అతడి మృతికి నివాళి అర్పించారు. కాల్పుల ఘటనలో నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నామని రోవాన్ కౌంటీ షెరీఫ్ తెలిపారు. దుండగుడు చోరీ కోసం వచ్చి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.