మనీలా: ఫిలిప్పైన్స్‌లో పయెంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీగా వర్షం పడుతున్నది. దాంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దేశంలోని 17 రీజియన్లలో మెట్రో మనీలా సహా 31,942 గ్రామాలను ఈ తుఫాను ప్రభావితం చేసింది. 5,75,728 కుటుంబాలకు చెందిన 18,12,740 మందిపై పయెంగ్ ప్రభావం చూపింది.
ఈ తుఫాను కారణంగా చోటుచేసుకున్న పలు ఘటనల్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 98కి చేరిందని ఫిలిప్పైన్స్కు చెందిన నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ కౌన్సిల్ తెలిపింది. గాయపడిన 98 మందిలో 58 మందిని గుర్తించామని, మరో 40 మందిని గుర్తించాల్సి ఉన్నదని అధికారులు చెప్పారు. మరో 63 మంది గల్లంతయ్యారని, 69 మందికి గాయాలయ్యాయని తెలిపారు.
తుఫాను బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి మృతదేహాల రికవరీ, సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు, క్షతగాత్రులకు చికిత్స లాంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. తుఫాను కారణంగా లక్షల ఇళ్లు నీటమునిగాయి. దాంతో వివిధ ఏరియాల్లో కలిపి 2.13 లక్షల మందికిపైగా బాధితులు పునరావకేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అంతేగాక తుఫానువల్ల 1,13,408 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు.