Israel Demonstrations | ఇజ్రాయెల్లో న్యాయవ్యవస్థను సంస్కరించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. దీనిపై పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు జెరూసలేం చేరుకుని ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటూ, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని రక్షించాలంటూ ప్రజలు నినదించారు.
న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు నెతన్యాహు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంకాగా ప్రతిపక్ష నేతలు కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పలువురు నెతన్యాహు వైపు దూసుకెళ్లగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని బయటకు తరలించారు. తర్వాత ప్రతిపాదిత చట్టంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష శాసనసభ్యులు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిన్నారని ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఆరోపించాడంతో.. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి విపక్ష సభ్యులు యత్నించారు.
దేశ న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం, పార్లమెంటులో ఆమోదించిన చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయడం ఇకపై అంత సులువు కాదు. అలాగే, న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వ పాత్ర కూడా పెరగనున్నది. అయితే, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి ముప్పు అని నిరసనకారులు పేర్కొంటున్నారు. కాగా, దేశాధ్యక్షుడు హెర్జోగ్ మాత్రం ఇది ప్రభుత్వం-ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుందని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల దృష్ట్యా రాజీపడాలని ఆయన సూచించారు. ఈ ప్రదర్శనలు దేశంలో హింసకు దారితీస్తాయని, ఇది రాజ్యాంగానికి ప్రమాదకరమని రాష్ట్రపతి హెచ్చరించారు.