ఆ రోజు రాత్రి వంట చేయలేకపోయిన ఆ తల్లి.. దగ్గరలో ఉన్న బర్గర్ కింగ్ షాపు నుంచి చికెన్ రాయల్ బర్గర్ ఆర్డర్ చేసింది. సాధారణంగా అక్కడి నుంచి తెచ్చుకున్న ఆహారం చాలా ఫ్రెష్‌గా ఉంటుందని ఆమె నమ్మకం. అందుకే అది రాగానే తినేందుకు కూర్చుంది. తల్లితో కలిసి భోజనం చేసేందుకు కూర్చున్న కుమారుడు.. తల్లికి బర్గర్ అందించాడు.
అది పట్టుకోగానే ఏదో తేడాగా అనిపించిందా తల్లికి. అనుమానంతో తినలేక బర్గర్‌ను ఓపెన్ చేసింది. అంతే, బర్గర్లో ఉన్న ఒక పెన్సిల్ దొర్లుకుంటూ వచ్చి కింద పడింది. ఈ ఘటన యూకేలోని బూటిల్ ప్రాంతంలో వెలుగు చూసింది. సదరు 41 ఏళ్ల మహిళ పేరు లియన్నా డే. తన బర్గర్లో ఇలా పెన్సిల్ ఉండటం చూసి షాకైన ఆమె వెంటనే బర్గర్ కింగ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
తన బర్గర్లో మహిళలు వాడే ఐలైనర్ వచ్చిందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే సదరు ఉద్యోగి ఆమె వాదనను కొట్టిపారేసింది. అది ఐలైనర్ కాదని, బర్గర్ వ్రాపర్లపై రాయడానికి ఉపయోగించే పెన్సిల్ అని, ఏం పర్లేదని చెప్పింది. ఆహారంలో పెన్సిల్ వస్తే పర్లేదనడం ఏంటని లియన్నా ప్రశ్నించగా.. ఆన్లైన్లో రిఫండ్ పెట్టుకోవాలని చెప్పి కాట్ కట్ చేసేసిందా ఉద్యోగి.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న లియన్నా.. రెస్టారెంట్ సిబ్బంది ప్రవర్తనతో కంగుతిన్నానని, ఆ బర్గర్ తినకుండానే పారేశానని చెప్పింది. దీనిపై స్పందించిన బర్గర్ కింగ్ కంపెనీ.. ఆమెకు క్షమాపణలు చెప్పి, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని తెలిపింది. అలాగే ఆమె బిల్లును రిఫండ్ కూడా చేసింది.