విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లను నకిలీ వీసాలతో మోసం చేయడం మనకు తెలుసు. అలాగే నకిలీ వీసాలతో మోసాలు చేసేవాళ్లను కూడా చూశాం. ఇటీవలే కొంతమంది మహిళలు నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లబోతూ హైదరాబాద్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంతకంటే వింత కేసు బయటకు వచ్చింది. ఒక అమెరికా దౌత్యవేత్త.. తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును ఇతరులకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు.
కొన్నిరోజుల క్రితం సిరియాకు చెందిన ఒక వ్యక్తిని జర్మనీ పంపించడానికి ప్రయత్నించాడీ అమెరికన్ అధికారి. సిరియా వ్యక్తి వద్ద లెబనాన్ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు చూసిన ఎయిర్‌పోర్టు అధికారులకు అనుమానం వచ్చింది. అతన్ని గట్టిగా ప్రశ్నించి, సీసీఫుటేజి పరిశీలించారు. దానిలో సదరు సిరియా వ్యక్తికి తన దుస్తులు, పాస్‌పోర్టు కాపీ ఇచ్చి డబ్బు తీసుకుంటున్న అమెరికా వ్యక్తి కనిపించాడు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు అధికారులు.. సదరు అమెరికన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలా తన పాస్‌పోర్టు మీద విదేశాలకు పంపేందుకు సదరు నిందితుడు.. పదివేల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టయిన వ్యక్తి అమెరికన్ అని, కానీ అతను అమెరికా దౌత్యవేత్త కాదని అమెరికా స్పష్టం చేసింది.