న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పంజ్‌షీర్ ఆక్రమణకు తాలిబన్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు దాడులు.. మరోవైపు చర్చలతో పంజ్‌షీర్‌ను దారిలోకి తెచ్చుకోవాలనుకొన్న వారి ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వెరసి అఫ్గాన్‌లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తాలిబన్లు పంజ్‌షీర్‌ను మాత్రం తమ నియంత్రణలోకి తెచ్చుకోలేకపోతున్నారు. పంజ్‌షీర్ నేతలతో తాలిబన్లు తలపెట్టిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. తాము తాలిబన్లకు తలవంచేది లేదని పంజ్‌షీర్ తేల్చిచెప్పింది. ‘సోదరులారా.. చర్చల ద్వారా పంజ్‌షీర్ సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైనంత ప్రయత్నించాం. కానీ చర్చలు విఫలం అయ్యాయి. సమస్యకు శాంతియుతంగా పరిష్కారం లభించడం పంజ్‌షీర్ గ్రూపుల నాయకులకు ఇష్టం లేదు. వారు యుద్ధం కోరుకొంటున్నారు. కానీ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని మీరైనా వారికి చెప్పండి’ అంటూ చర్చలకు నేతృత్వం వహించిన తాలిబన్ నేత ముల్లా అమీర్ ఖాన్ స్వయంగా పంజ్‌షీర్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఆడియో సందేశం ఇచ్చారు.
పంజ్‌షీర్‌కు తాలిబన్ గవర్నర్
అమెరికా బలగాలు వెళ్లిపోగానే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడికి బయల్దేరారు. తాము పంజ్‌షీర్ లోయలోకి ప్రవేశించామని, షుతార్ జిల్లాను స్వాధీనం చేసుకొన్నామని ప్రకటించారు. పంజ్‌షీర్‌కు కొత్త గవర్నర్‌ను నియమించినట్టు ముల్లా అమీర్ ఖాన్ ప్రకటించారు. పంజ్‌షీర్‌లో స్థానిక గ్రూపులు తాలిబన్లకు సహకరించాలని సూచించారు.
అఫ్గాన్‌లో అమెరికా సాధించింది శూన్యం: పుతిన్
అఫ్గానిస్థాన్‌లో 20 ఏండ్లలో అమెరికా సాధించినది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించారు. అఫ్గాన్ ప్రజలపై అమెరికా తన నియమాలను, ప్రమాణాలను రుద్దడానికి ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు.
ఉపసంహరణ ఉత్తమ నిర్ణయం: బైడెన్
అఫ్గానిస్థాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం అమెరికాకు ఉత్తమమైనదని చెప్పారు. అమెరికా ప్రయోజనాలకు ఇక అవసరం లేని యుద్ధాన్ని కొనసాగించడంలో అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడులు జరిగి మరో 11 రోజుల్లో 20 ఏండ్లు కావస్తున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. ‘అఫ్గానిస్థాన్ ఎందుకు వెళ్లామో అందులో పదేండ్ల క్రితమే విజయం సాధించాం. మరో పదేండ్లు అక్కడ ఉన్నాం. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఇదే సరైన సమయమ’ని ఆయన పేర్కొన్నారు.
350 మంది తాలిబన్లు హతం?
తాలిబన్ల ప్రకటనకు పూర్తి భిన్నంగా పంజ్‌షీర్ ఉత్తర కూటమి ట్వీట్ చేసింది. పంజ్‌షీర్ ఆక్రమణకు వచ్చిన తాలిబన్లు బాగా దెబ్బతిన్నట్టు తెలిపింది. దాదాపు 350 మంది తాలిబన్లు తమ చేతిలో హతమైనట్టు వెల్లడించింది. 40 మందికిపైగా బందీలుగా చిక్కినట్టు పేర్కొన్నది. అమెరికా వాహనాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నామని తెలిపింది.
తాలిబన్లకు అల్ ఖైదా అభినందన
కశ్మీర్‌కూ విమోచన కల్పించాలని పిలుపు
అఫ్గాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అభినందించింది. ‘కశ్మీర్‌కు కూడా విమోచన’ లభించాలని పిలుపునిచ్చింది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజు మంగళవారం అల్ ఖైదా ప్రకటన విడుదల చేసింది. ‘లేవంట్, సోమాలియా, యెమెన్, కశ్మీర్‌తో పాటు ఇస్లాంకు శత్రువులైన వారి చేతుల్లో ఉన్న ఇస్లామిక్ ప్రాంతాలు విముక్తి పొందాలి. అల్లా! ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛ ప్రసాదించు’ అని కోరింది.