వాషింగ్టన్: ప్రపంప వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సంబంధిత ఆంక్షలు, నిబంధనలను పలు దేశాలు సడలిస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ బ్రిటన్, చైనా వంటి దేశాల్లో విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒక హెచ్చరిక జారీ చేసింది. కరోనా మహమ్మారి ముగియలేదని తెలిపింది. అలాగే ఆరోగ్య, ఆర్థిక నష్టాల పెరుగుదల కొనసాగుతూనే ఉంటాయని అంచనా వేసింది. ‘దీర్ఘకాలిక కరోనా ప్రమాదాల మేనేజ్‌కు ప్రపంచ వ్యూహం’ అనే పేరుతో ఒక అధ్యయనం జరిపింది.
కరోనా దీర్ఘకాలం మనతోనే ఉంటుందని ఆ నివేదికలో ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి ప్రమాదకరమైన వేరియంట్ల వల్ల వాటిల్లే పరిణామాలను ఇందులో విశ్లేషించింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తే అనిశ్చితిపై అంచనాకు, దీర్ఘకాలిక ప్రమాదాలను ఎదుర్కొనే కొత్త వ్యూహానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని తెలిపింది.
అయితే ఈ వ్యూహంలో విధానపరమైన నాలుగు కీలక చిక్కులు ఉన్నాయని ఐఎంఎఫ్ అధ్యయన రచయితలు పేర్కొన్నారు. ‘ముందుగా వ్యాక్సిన్లకు మించిన సమగ్రమైన టూల్ కిట్‌ను కలిగి ఉండాలి. రెండోవది, అభివృద్ధి చెందుతున్న వైరస్‌ను పర్యవేక్షించడంతోపాటు ఆ టూల్ కిట్‌ను డైనమిక్‌గా అప్‌గ్రేడ్ చేయాలి. మూడవది, కరోనాపై తీవ్రమైన ప్రతిస్పందన నుంచి స్థిరమైన వ్యూహానికి మనం మారాలి. ఇతర ఆరోగ్య, సామాజిక ప్రాధాన్యతలతో సమానంగా ఏకీకృతం కావాలి. నాల్గవది, భవిష్యత్తులో కోవిడ్-19కి మించిన అంటు వ్యాధుల ముప్పును ఎదుర్కొనేందుకు ఏకీకృత ప్రమాద నివారణ విధానం అవసరం’ అని పేర్కొంది.