మాస్కో: తమకు రావాల్సిన నీటిని అడ్డుకున్నా.. లేక దారి మళ్లించినా.. దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొడుతామని, అవసరమైతే అణ్వాయుధ దాడి(Nuclear Attack)కి కూడా పాల్పడుతామని పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మొహమ్మద్ ఖలీద్ జమాలీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా మీడియా టీఏఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ చర్యలను ఖండిస్తూ సింధూ జలాలను ఆపేందుకు భారత సర్కారు సిద్ధమైంది. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ.. తాజాగా చీనాబ్ నది నీటిని రిలీజ్ చేయడం లేదు.
ఒకవేళ నీళ్లను అడ్డుకున్నా లేక దారి మళ్లించినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆ అంబాసిడర్ పేర్కోన్నారు. నీళ్లను అడ్డుకోవడాన్ని, డైవర్ట్ చేయడాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని, దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొడుతామన్నారు. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రెండూ అణ్వాయుధ దేశాలే అని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఆయన అన్నారు.