కరాచీ: పాకిస్థాన్‌లో సింధు ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ అమ్మాయి(Pakistani Girl) ఇంట్లో వాళ్లకు విషం ఇవ్వడంతో.. 13 మంది కుటుంబసభ్యులు మరణించారు. ఈ ఘటన ఆగస్టు 19వ తేదీన హబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో జరిగింది. ఆ విషాద ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. కానీ ఇంటి పెద్దలు ఆ పెళ్లికి నిరాకరించారు. ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయంతో ఆ అమ్మాయి ఆగ్రహానికి గురైంది. తనకు ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోనివ్వలేదని కక్ష పెంచుకున్నది.
ఇక ఆ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కుటుంబసభ్యుల్ని చంపేందుకు ప్లాన్ వేసింది. ఇంట్లో ఆహారం తీసుకున్న తర్వాత 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే వాళ్లను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే వాళ్లు మృతిచెందినట్లు తేల్చారు. విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల మరణించినట్లు పోస్టుమార్టమ్ ద్వారా తెలిసినట్లు సీనియర్ పోలీసు అదికారి ఇనాయత్ షా తెలిపారు. ఇంట్లో రొట్టెలు తయారు చేసే పిండిలో విషం కలిపినట్లు విచారణలో వెల్లడైందన్నారు.