Pakistan : గత ఏడాది భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌పై భారత్ దాడి చేసింది. అయితే, పాక్ కూడా ఇండియాపై దాడులకు దిగింది. ఈ సందర్భంగా భారత్‌లోని రెండు వైమానిక స్థావరాలపై దాడి చేశామని పాక్ సైనికాధికారి ఒకరు వెల్లడించాడు. అయితే, అతడు చెబుతున్నట్లుగా అసలు ఇండియాలోని ఆ ప్రదేశాల్లో ఎయిర్‌బేస్‌లే లేవని తేలింది. దీంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాక్ ఇలా అబద్ధాలు చెప్పుకొంటుందని విమర్శిస్తున్నారు.
ఇటీవల పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ మునీబ్ జమాల్ అనే పాక్ ఆఫీసర్ అక్కడి ఒక మీడియాతో మాట్లాడాడు. తమకు తమ ఆర్మీ ఇండియాలోని రెండు స్తావరాలను లక్ష్యంగా ఇచ్చిందన్నాడు. రాజౌరి ఎయిర్‌బేస్, మామున్ ఎయిర్ బేస్‌లపై దాడి చేయాలనే ఆదేశాల ప్రకారం.. తాము ఇండియాలోని ఈ రెండు ఎయిర్‌బేస్‌లపై విజయవంతంగా దాడి చేశామని తెలిపాడు. అలాగే, కొన్ని క్షిపణి శకలాలు కూడా అక్కడ దొరికాయన్నాడు. అయితే, అతడు చెప్పినట్లుగా రాజౌరి జమ్మూ కాశ్మీర్‌లోని ఒక జిల్లా. అక్కడ ఎయిర్‌బేస్ లాంటిదేమీ లేదు. అలాగే, మామూన్.. మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా మాత్రమే. ఇది పఠాన్‌కోట్ సమీపంలో ఉంటుంది. అక్కడ కూడా ఎయిర్‌బేస్ లేదు.
Another Lahori Churan
Pakistan army officer claimed that they hit Rajouri & Mamun airbase 😂
No such airbases exist. pic.twitter.com/rpgzwOaaCG— War & Gore (@Goreunit) May 19, 2026
అలాగే, పాక్ క్షిపణి శకలాలు ఇండియాలో దొరికాయంటూ అతడు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పని తేలింది. నిజానికి బార్మర్, జలంధర్ ప్రాంతంలోని సిర్సా సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో సరిహద్దు వద్ద కొన్ని శకలాలు లభించాయి. సెప్టెంబర్ 2025లో ఫతా–1 మిస్సైల్‌ను శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలో కనుగొన్నారు. అలాంటిది ఇండియాలోని ఈ రెండు ఎయిర్‌బేస్‌లపై విజయవంతంగా దాడి చేశామని పాక్ అధికారి చెప్పడంతో ఇండియాతోపాటు సొంత దేశంలోని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఇంత నమ్మకంగా అక్కడి మీడియాకు పాక్ సైనికాధికారులు అబద్ధాలు ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు.