Train blast : పాకిస్థాన్ (Pakistan) లో బలూచిస్థాన్ (Baluchistan) రెబల్స్ జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) రైలు లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సింధ్-బలూచిస్థాన్ సరిహద్దులో సుల్తాన్‌కోట్ ప్రాంతంలో క్వెట్టా వైపుగా రైలు వెళ్తున్న సమయంలో పట్టాలపై ముందుగా అమర్చిన పేలుడు పదార్థాలను పేల్చేశారు. ఆ ధాటికి రైలు పట్టాలు తప్పింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బలూచ్ రెబల్ గ్రూప్, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించాయి.
ఈ ఏడాది జూన్‌లో సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ వద్ద పేలుడు సంభవించింది. దాంతో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇదే రైలు మార్చిలో హైజాక్‌కు గురైంది. పాక్‌లోని వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేసి అందులోని వందల మందిని బందీలుగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని రక్షించడానికి వెళ్లిన పాకిస్థాన్ భద్రతాధికారులను హతమార్చారు. ఆ తర్వాత అధికారులు ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించారు.
కాగా పాకిస్థాన్‌లో బలూచ్ రెబల్స్, తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ గ్రూప్ ఈ రైలును లక్ష్యంగా చేసుకోవడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుంటారు. దాంతో మిలిటెంట్ గ్రూప్‌లకు ఈ రైలు టార్గెట్‌గా మారింది.