పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ దాడులు చేసే అవకాశం ఉన్నదన్న కారణంతో క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నట్టు పాక్ మిలిటరీ నోటమ్ (నోటీస్ టూ ఎయిర్‌మన్) తెలిపింది.
శుక్రవారంనాడు ఈ పరీక్షలు ఉండనున్నట్టు తెలుస్తోంది. 480 కిలోమీటర్ల మేర పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల క్షిపణులను పాక్ పరీక్షించే అవకాశం ఉన్నదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, భారత్ దాడి చేస్తే తిప్పికొట్టడానికి అప్రమత్తంగా ఉండాలంటూ సైన్యాధికారులకు ఆదేశాలనిచ్చిన పాక్.. కీలక అధికారులకు సెలవులను రద్దు చేసినట్టు తెలిసింది. మరోవైపు, ఉగ్రదాడులు జరిగిన వెంటనే పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్టు సమాచారం.