Pakistan treatment | సోషల్ మీడియాలో దేవుడిపై వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్లో ఓ హిందూ బాలుడికి జైలుశిక్ష విధించారు. ఈ ఘటన పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో జరిగింది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ ఆ బాలుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, తమ పిల్లాడు కనిపించడం లేదంటూ నవంబర్ నెలలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా నెల రోజుల తర్వాత జైలులో పెట్టినట్లు వారికి సమాచారం ఇచ్చారు.
బిట్టర్ వింటర్ నివేదిక ప్రకారం, లవ్ కుమార్ అనే బాలుడు మత మార్పిడిపై విచారం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ రాశాడు. అందులో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. ‘ఓ దేవుడా! నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నావ్..?’ అంటూ దేవుడ్ని ప్రశ్నిస్తూ ఉర్దూలో రాశాడు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే, తమ కుమారుడు కనిపించడం లేదంటూ నవంబర్ 22 నుంచి తల్లిదండ్రులు వెతుకుతున్నారు. కాగా, డిసెంబర్ 27 న బాలుడ్ని జైలులో పెట్టినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
పాకిస్తాన్లో దైవదూషణపై చట్టం స్పష్టంగా లేదని, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించవచ్చునని కొందరు న్యాయ పరిశీలకులు చెప్తున్నారు. 2022 లో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని పాకిస్తాన్ మైనారిటీ కమ్యూనిటీపై దైవదూషణ ఆరోపణలు చేయడం ద్వారా అనేక దాడులు జరిగాయి. దైవదూషణను సాకుగా మాత్రమే వాడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మైనారిటీ వర్గాలకు చెందిన భూములను లాక్కొని వారి నుంచి డబ్బులు దండుకునేందుకు అక్కడి ప్రజలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.