ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంప్రదింపులు చేపట్టింది. అయితే అమెరికా మీడియా ప్రకారం ఇరాన్ తన మిలిటరీ విమానాలను పాకిస్థాన్‌లో దాచినట్లు తెలిసింది. పాక్‌లో ఉన్న ఎయిర్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఇరాన్ తన మిలిటరీ విమానాలను పార్క్ చేసినట్లు సీబీఎస్ న్యూస్ తన కథనంలో పేర్కొన్నది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణ పొందేందుకే ఇరాన్ తన విమానాలను పాక్‌లో పార్క్ చేసిందని ఆ కథనంలో వెల్లడించారు. పాకిస్థాన్‌లో ఉన్న నూర్ ఖాన్ వైమానిక దళ స్థావరంకు ఆ విమానాలను ఇరాన్ తరలించింది. రావాల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉన్నది.
వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఇరాన్ తన మిలిటరీ, ఏవియేషన్ అసెట్స్‌ను దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సీ-130, లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన సీ-130 రవాణా విమానాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇరాన్‌తో ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటించిన తర్వాతనే నూర్ ఖాన్ బేస్‌కు విమానాలను పంపినట్లు అమెరికా అధికారులు అంచనా వేశారు. మిలిటరీ, ఏవియేషన్ అసెట్స్‌ను కాపాడుకునే చర్యలో భాగంగా వాటిని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ బేస్‌లకు ఇరాన్ తరలించి ఉంటుందని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారు.
అయితే ఇరాన్‌కు సహకరించిన పాకిస్థాన్‌పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ఎలా ఇరాన్‌కు సహకరించిందని రిపబ్లికన్ సీనియర్ నేత లిండ్సే గ్రహం ప్రశ్నించారు. ఒకవేళ తమకు అందిన సమాచారం నిజమే అయితే, అప్పుడు మీడియేటర్‌గా పాకిస్థాన్ పాత్రను అనుమానించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అయితే ఇరాన్‌కు చెందిన మహన్ ఎయిర్ పౌర విమానాలను కాబూల్ విమానాశ్రయంలో పార్క్ చేసిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించింది.