హైదరాబాద్, జూలై 29 ( నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం 7,437ఉద్యోగాల భర్తీకోసం టీఎస్ఎల్పీఆర్బీ (తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్) నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ మేరకు బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు ఉద్యోగ ఖాళీల భర్తీ వివరాలను వెల్లడించారు. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, జైళ్ల శాఖల పరిధిలోని ఖాళీలను ఈ నాలుగు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించే కచ్చితమైన తేదీలను బోర్డు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకొనే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అన్ని అర్హతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తు చేసుకొనే ముందే అభ్యర్థులు తమ శారీరక, వైద్య ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో? లేదో? సివిల్ సర్జన్ చేత పరీక్షించుకోవాలని బోర్డు సలహా ఇచ్చింది.
పోలీస్ ఉద్యోగాలకు అర్హులైన ఆయా విభాగాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో, తదుపరి ప్రక్రియలో సమర్పించడానికి ఈ కింది ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని బోర్డు కోరింది.
1. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన లేటెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ (SC Group-I, SC Group-II, SC Group-III సబ్-క్లాసిఫికేషన్‌తో)
2. 2026 ఏప్రిల్1 నాడు లేదా ఆ తర్వాత జారీ చేయబడిన EWS (ఆర్థికంగా వెనుకబడిన తరగతుల) సర్టిఫికెట్
3. 2026 ఏప్రిల్1 నాడు లేదా ఆ తర్వాత జారీ చేయబడిన బీసీ అభ్యర్థుల నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్
4. స్థానిక అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్లు)
