పాల్వంచ/ మణుగూరు టౌన్/ భద్రాచలం, జూలై 29 : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు పాల్వంచ, మణుగూరు, భద్రాచలంలలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు బుధవారం నాటికి 31వ రోజుకు చేరాయి.
వర్షం జోరుగా కురుస్తున్నా పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో, మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ప్లకార్డులతో, భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయంలో నిరసన చేపట్టారు. వైటీపీఎస్‌లో ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్లాంట్ల ప్రైవేటీకరణతో సంస్థ మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జెన్కో యాజమాన్యం ఉన్న ఉద్యోగులకు తోడు అదనంగా నియమించి ప్లాంట్ల నిర్వహణ చేపట్టాలని సూచించారు. జేఏసీ నాయకులు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.