న్యూఢిల్లీ, జూన్ 21: ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్థాన్ నామినేట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజాతో ‘జాతి నిర్మూలన యుద్ధం’, ఇరాన్‌పై బాంబు దాడికి ట్రంప్ మద్దతు ఇచ్చిన విషయాన్ని పాక్‌కు గుర్తు చేస్తూ అనేక మంది పాకిస్థాన్ హక్కుల కార్యకర్తలు, రచయితలు సామాజిక మాధ్యమం ద్వారా ఆ ప్రభుత్య చర్యను నిశితంగా విమర్శించారు.
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరిగింది తప్ప, అందులో ట్రంప్ ప్రమేయం లేదంటూ భారత దేశం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. అయినప్పటికీ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్‌ను పాకిస్థాన్ ట్రంప్‌కు కట్టబెట్టడంపై పాక్ మేధావులు విమర్శిస్తున్నారు.
ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం దయనీయమని రచయిత, పాకిస్థాన్ జర్నలిస్టు జాహిద్ హుస్సేన్ విమర్శించారు. గాజా యుద్ధం వెనుక ఉండి సహాయపడి, ఇప్పుడు ఇరాన్ ఆక్రమణకు సహకరిస్తున్న ట్రంప్ పేరును ఎలా ప్రతిపాదిస్తారని ఆయన ప్రశ్నించారు. కృతజ్ఞత అనేది విధానంగా పనిచేయదని, పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని ఐరాసలో పాకిస్థాన్ రాయబారిగా పనిచేసిన మలీహ లోది పేర్కొన్నారు.
పాకిస్థాన్‌ది కీలుబొమ్మ పాలన, శూన్య గౌరవ ప్రభుత్వమని పలువురు విమర్శించారు. అది అగ్రదేశ ప్రాభవం కోసం పాకులాడుతున్నదని, ఏ మాత్రం గౌరవం లేకుండా ట్రంప్‌ను నోబెల్ బహుమతికి ప్రతిపాదించిందని హక్కుల నేత రిదా రషీద్ ట్వీట్ చేశారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపి శాంతికి కృషి చేశానని శుక్రవారం ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. అయితే ఈ రెండు దేశాల మధ్య గత నెల యుద్ధాన్ని ఆపినందుకు తాను చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి రాకపోవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.