ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆహార సంక్షోభం అంచుకు చేరింది. ఆ దేశంలో గోధుమ పిండికి తీవ్ర కటకట ఏర్పడింది. జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలలో దీని కొరత తీవ్రంగా ఉంది. పంజాబ్ ఆహార శాఖ రావల్పిండి, ఇస్లామాబాద్ల్లోని మిల్లులకు గోధుమల సరఫరా నిలిపివేయడంతో మార్కెట్లలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఆహార భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నీటి సరఫరాపై భారత్ విధించిన ఆంక్షలు, అఫ్ఘాన్ రవాణా అడ్డంకులు, నీటి కొరత, ఆనకట్ట నీటిమట్టాలు తగ్గడం ఇవన్నీ దేశ వ్యాప్తంగా మరో సంక్షోభం గురించి భయాలను పెంచుతున్నాయి.
పిండి, గోధుమలు, మెత్తని పిండికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆర్డర్లన్నీ శుక్రవారం రాత్రి నుంచి రద్దు చేశారని, ప్రస్తుతం షాపులు, తండూర్ యజమానుల వద్ద ఎలాంటి సరుకు లేదని ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. ఈ క్రమంలో రావల్పిండిలోని పిండి మిల్లుల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. గోధుమ పర్మిట్లను కనుక వెంటనే పునరుద్ధరించకపోతే ఉత్పత్తి స్తంభించిపోతుందని హెచ్చరించారు. ఇది దేశ రాజధాని, పరిసర ప్రాంతాలలో ఆహార కొరత, మానవతా అత్యవసర పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించింది