ఇస్లామాబాద్, అక్టోబర్ 21: పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఐదేండ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రిగా ఉండగా విదేశీయుల నుంచి పొందిన బహుమతులను తోషఖానా నుంచి తక్కువ ధరకు సొంతం చేసుకొని, వాటిని ఎక్కువ ధరకు విక్రయించారనే ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ శుక్రవారం విచారణ జరిపింది. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజాతో కూడిన నలుగురు సభ్యుల బెంచ్ ఏకాభిప్రాయ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ తన పదవిని కోల్పోనున్నారు. ఐదేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయారు. జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకుగానూ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ఆరు స్థానాలను కైవసం చేసుకున్న రెండు రోజులకే ఎన్నికల సంఘం తీర్పు వెలువరించడం గమనార్హం.