India Pakistan Tension | ఢిల్లీ, మే 10: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ లెఫ్టినెంట్ జనరల్, పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదురీ తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్‌కు గతంలో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో లింకులున్న విషయం వైరల్‌గా మారింది. అంతేకాదు, అతనిపై అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినట్టు బయటపడింది.
ఐరాస డాక్యుమెంట్స్ ప్రకారం.. బషీరుద్దీన్ గతంలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను కలిసినట్టు సమాచారం. అంతేకాదు, న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ సంబంధిత సమాచారాన్ని లాడెన్‌తో పంచుకున్నట్టు ఆరోపణలున్నాయి. తాలిబన్ పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌లో మానవతా సాయం కోసం 1999లో స్థాపించిన ఉమ్మా తమీర్ ఈ నౌ అనే సంస్థకు ఆయన విరాళాలు సేకరించినట్టు సమాచారం. లాడెన్‌ను కలిశారనే అభియోగాలపై 2001లో అతన్ని అరెస్టు చేశారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు సంబంధించిన బ్లాక్డ్ పర్సన్స్, స్పెషల్లీ డిజిగ్నెటేడ్ నేషనల్స్ జాబితాలో అతని పేరు ఉన్నట్టు తెలుస్తున్నది.