ఇస్లామాబాద్: పాకిస్థాన్ వైమానిక దళాని(Pakistan Air Force)కి చెందిన శిక్షణ విమానం కూలింది. ఖైబర్ ఫక్తున్‌క్వా ప్రావిన్సులోని మర్దాన్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రొటీన్ ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా జరిగిన ఫ్లయింగ్ సెషన్ విషాదానికి దారి తీసింది. మృతులను పాక్ వైమానిక దళానికి చెందిన ఫ్లయిట్ లెఫ్టినెంట్ మొమహ్మద్ ఖాసిమ్ అబ్దుల్లా, పాక్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ తాహ అబ్బాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల దర్యాప్తునకు ఆదేశించినట్లు వైమానిక దళం పేర్కొన్నది. పైలట్ మృతుల పట్ల ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీతో పాటు వివిధ దళాలకు చెందిన చీఫ్‌లు సంతాపం ప్రకటించారు. పైలట్ల మృతి పట్ల దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నివాళి అర్పించారు. వారం క్రితమే పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ వద్ద సాంకేతిక లోపం వల్ల కూలిన విషయం తెలిసిందే. జూన్ 10వ తేదీన జరిగిన ఆ ఘటనలో 22 మంది సిబ్బంది మృతిచెందారు. ఆ ఘటన పట్ల కూడా దర్యాప్తునకు ఆదేశించారు. పాకిస్థాన్‌లో ఇటీల ఆ దేశ సైన్యానికి చెందిన హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూలాయి.