దాయాది దేశం పాకిస్తాన్లో ఇటీవల వచ్చిన వరదలపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. అదే సమయంలో ఆ దేశంలో నిర్మానంలో ఉన్న భారీ డ్యాం గనుక పూర్తయ్యి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని కొందరు అన్నారు. అదిగో అక్కడే వచ్చింది తంటా. తీగ లాగితే డొంక కదిలినట్లు.. తాజాగా వచ్చిన వరదలు ఆ డ్యాం ఇంకా ఎందుకు పూర్తి కాలేదనే ప్రశ్నను లేవనెత్తాయి.
దీంతో భారీ కుంభకోణం బయటపడింది. సింధూ నదిపై నిర్మించాలని అనుకున్న ఈ డైమర్-బాషా డ్యామ్ ఎత్తు 272 మీటర్లు. ఎప్పుడో 1980లోనే దీన్ని పూర్తి చేయాల్సింది. అయితే పర్యావరణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వరదలు వంటి సమస్యల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ (పీఏసీ) దీనిపై నివేదిక సిద్ధం చేసింది.

2018లో అప్పటి పాక్ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసర్ ఈ డ్యాం నిర్మాణానికి ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఎలాగైనా ఈ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నారు. ఈ నిధికి సాకిబ్తోపాటు అప్పటి దేశాధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జాయింట్ లీడర్షిప్ తీసుకున్నాడు. అప్పటికి డ్యాం నిర్మాణానికి 14 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీంతో చాలా మంది విరాళాలిచ్చారు. క్రికెటర్లు, సైనికులు కూడా తమ జీతాల్లో నుంచి కొంత భాగం తీసి ఈ నిధికి అందించారు.
2019లో సాకిబ్ రిటైరయ్యే సమయానికి ఆ నిధిలో 6.3 బిలియన్ల వరకు జమ అయింది. మిగతావి డబ్బు కూడా ఎలాగోలా జమ చేద్దామని అనుకుంటుండగా.. తాజాగా సాకిబ్ చేసిన కామెంట్లు అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాయి. ఈ నిధిని ఏర్పాటు చేసింది డ్యాం నిర్మించడానికి కాదని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికని సాకిబ్ అన్నారు. దీంతో ప్రజలంతా షాకైపోయారు. అదే సమయంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

పీఏసీ నివేదిక ప్రకారం డ్యాం నిర్మాణం కోసం 40 మిలియన్ డాలర్లు అవసరం అని చెప్పిన ప్రభుత్వం దాతల సాయం కోరింది. ఇలా నిధులు సేకరించి, డ్యాం పూర్తి చేస్తున్నామని ప్రచారం చేసుకోవడానికి 63 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. డ్యాం నిర్మాణం ముందుకు సాగకుండా తాము పంపిన డబ్బంతా ఇలా యాడ్స్ ఇవ్వడానికి ఉపయోగించారని తెలిసి ప్రభుత్వాన్ని ఏం అనాలో కూడా వాళ్లకె తెలియలేదు.
ఈ విషయం వెలుగు చూడటంతో ప్రతిపక్ష నేతలు మండి పడ్డారు. డ్యాం నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకోవడానికే నిధి ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో మాజీ చీఫ్ జస్టిన్ సాకిబ్ నిసార్‌కు పార్లమెంటు కమిటీ సమన్లు పంపింది. ప్రస్తుతం ఈ నిధి విషయమై దర్యాప్తు జరుగుతోంది. ఇలా వరదల వల్ల దేశంలోని భారీ కుంభకోణం బయటపడిందా దేశంలో.