సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ట్యాంకర్లు సరఫరా చేసేందుకు జలమండలి ప్రత్యేక వ్యవస్థ రూపొందించేందుకు సిద్ధమవుతున్నది. ఎండాకాలంలో అపార్ట్మెంట్ వాసులను నీటి సమస్య వేధిస్తున్నది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం.. జూలై నెల ద్వితీయార్థం వస్తున్నా వర్షాలు పడకపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది కానీ తగ్గడం లేదు. ఈనేపథ్యంలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు తమకు ట్యాంకర్లను ప్రత్యేకంగా కేటాయించాలని కోరుతున్నారు.
20 వేల లీటర్ల ట్యాంకర్లను బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసేలా ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ట్యాంకర్ల సరఫరాలో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు జలమండలి ఉన్నతాధికారులు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. జలమండలి వ్యాప్తంగా ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా 2 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల సంఖ్యను పెంచి.. అపార్ట్మెంట్లకు సరఫరా చేయనున్నారు. అయితే ఫిల్లింగ్ స్టేషన్లలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లను నింపేందుకు చిన్న మోటార్లు అందుబాటులో ఉన్నాయి.
20కేఎల్ ట్యాంకర్లను వీలైనంత తొందరగా నింపేందకు సామర్థ్యం ఎక్కువగా ఉన్న పెద్ద మోటార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు సరఫరా చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని జలమండలి ఎండీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రత్యేక విభాగంలో కేవలం 20 కేఎల్ ట్యాంకర్లు మాత్రమే ఉంటాయి. కేవలం అపార్ట్మెంట్లకు మాత్రమే సరఫరా చేసే వింగ్ ఏర్పాటు కానున్నది. అందుకు అనుగుణంలో సాంకేతికతను ప్రత్యేకంగా రూపొందించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తిచేస్తే వచ్చే వేసవికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వాసులకు నీటి కష్టాలు తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు.