ఇస్లామాబాద్: భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న, నేడు, రేపు అఫ్గన్లు ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతుగానే ఉంటారన్నారు. అఫ్గాన్ శరణార్థులకు దశాబ్దాలుగా ఇస్లామాబాద్ మద్దతు ఇస్తున్నప్పటికీ, వారు భారత్‌కు దగ్గరగా, పాక్ పట్ల శత్రుత్వంతో ఉన్నారని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వారు గతంలోనూ.. ప్రస్తుతం కూడా భారత్‌కు విధేయులుగానే ఉన్నారని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా ఒత్తిడి మేరకు లక్షలాది మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తాము వారికోసం భారీ త్యాగాలు చేశామని, అయినప్పటికీ తమకు మద్దతుగా ఎప్పుడూ నిలబడలేదని చెప్పారు. అయినా వారిపట్ల తమ దాతృత్వ స్వభావం మారలేదన్నారు. అయితే అఫ్గానిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఖవాజా ఆసిఫ్ గతంలో వ్యాఖ్యానించారు. తమపై చేస్తున్న దాడులను ఇక సహించేది లేదని, తమ ఓపిక నశించిందన్నారు. ఉగ్రవాదులను అరికట్టడంతో తాలిబన్లు విఫలమైతే ఇస్లామాబాద్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత.. ఆ దేశానికి చెందిన ఒక మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిక్ ఖాన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకోనున్నారు. ఈ నెల 16 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.