న్యూఢిల్లీ: మయన్మార్, థాయ్‌లాండ్‌ను రెండు భారీ భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇక బ్యాంకాక్‌లో 10 మంది చనిపోయారు. మరో 1670 మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.
కాగా, ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్‌లోని మాండలే నగరంలో చోటుచేసుకున్నది. రెండు భూకంప కేంద్రాలు మాండలేకు సమీపంలోనే ఉండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నది. ఇక దేశ రాజధాని నేపిడాలో ఓ వెయ్యి పడకల దవాఖాన కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో అది సామూహిక ప్రమాద ప్రాంతం అయ్యే అవకాశం ఉందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇరు దేశాల్లోనూ సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కున్నవారిని రక్షించేందుకు అధికారులు, రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.