Spain floods | యూరప్ దేశం స్పెయిన్ (Spain) ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మెరుపు వరదలు స్పెయిన్‌లో విలయాన్ని సృష్టించాయి. భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు మొత్తం నీట మునిగాయి. ఇక మూడు రోజుల క్రితం సంభవించిన ఈ మెరుపు వరదలకు మరణించిన వారి సంఖ్య 200 దాటింది.
శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా 205 మంది మృత్యువాత పడగా.. అందులో ఒక్క వాలెన్సియా (Valencia) నగరంలోనే 202 మంది మరణించారు. మరో ఇద్దరు కాస్టిల్లా మంచా రీజియన్‌లో, ఇంకొకరు యాండలూసిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ వరదలకు డజన్ల కొద్దీ ప్రజలు గల్లంతయ్యారు.
గ్రామాలు, పట్టణాలు మొత్తం నీట మునిగాయి. ప్రధాన నగరాలు సైతం నదులను తలపిస్తున్నాయి. కార్లు, పెద్ద పెద్ద కంటైనర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వాలెన్సియా (Valencia) ప్రాంతం ఈ వరదలకు తీవ్ర ప్రభావితమైంది. ఇక్కడ అంచనాలకు మించి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి కురవాల్సిన వర్షం ఎనిమిది గంటల్లో కురిసినట్లు పేర్కొన్నారు. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోగా.. దుకాణాలు కూడా బురదలో కూరుకుపోయాయి. రహదారులు సైతం గుర్తుపట్టకుండా మారిపోయాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరదలు సంభవించి మూడు రోజులైనా అనేక నగరాలు, గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 4,500 మందికిపైగా ప్రజలను సివిల్ గార్డ్స్ రక్షించినట్లు అంతర్గత మంత్రి ఫెర్నాండో గ్రాండే మర్లాస్కా తెలిపారు. దాదాపు 3 వేల మంది అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్‌ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
Also Read..
Bomb Threat | సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
Cantonment | సంప్రదింపులే తప్ప ముందుకు పడని అడుగులు.. కంటోన్మెంట్ విలీనం లేనట్లేనా..?