Cantonment | సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ) : దీర్ఘకాలంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న ‘జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం’ ప్రక్రియ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదన అటకెక్కినట్లు తెలుస్తున్నది. కేంద్ర రక్షణ శాఖ విలీన ప్రక్రియను దాదాపు పక్కకు పెట్టిసినట్లు విశ్వసనీయ సమాచారం.
డిఫెన్స్ ఎస్టేట్స్ వర్గాల అనధికారిక సమాచారం నేపథ్యంలో విలీనానికి బ్రేక్ పడినట్లు బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కంటోన్మెంట్ నూతన చట్టం రూపొందించడంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ల విలీనం వంటి అంశాలపై నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాటికి కంటోన్మెంట్ చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లు, బోర్డు ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కంటోన్మెంట్ బోర్డులను శాశ్వతంగా రదు చేయాలని కంటోన్మెంట్లను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేయాలనే ప్రతిపాదన దాదాపు దశాబ్దం కిందటే సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధానంగా కంటోన్మెంట్ల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై 2018లోనే కేంద్రం సుమిత్ బోస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2019లో ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకే ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006’ స్థానంలో నూతన బిల్లును రూపొందించారు.
‘ది కంటోన్మెంట్ బిల్-2020’ పేరిట రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అదే ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో చేర్చారు. మరోవైపు కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై కూడా అధ్యయనం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జనవరి 4న సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై చర్చించేందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ అయిన కమిటీలో ఏం చర్చించారో ఇప్పటికీ బహిరంగంగా వెల్లడించకపోవడం గమనార్హం. ఈ తరుణంలోనే 2023 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ల ఎన్నికల నిర్వహణకు కేంద్రం నోటిఫికేషన్ వెలువరించింది. మార్చిలో ఎన్నికల ప్రక్రియను అర్ధంతరంగా నిలుపుదల చేస్తూ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది.
ఈ ఏడాది జూన్ 25న రక్షణ శాఖ సెక్రెటరీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కంటోన్మెంట్ అధికారులపై కంటోన్మెంట్ విలీనంపై అనేకసార్లు చర్చించి అభిప్రాయాలు సేకరించారు. ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో పాటు కంటోన్మెంట్ విలీనం అత్యంత క్లిష్టమయ్యే ప్రక్రియగా తేలడంతో విలీన ప్రతిపాదనకు కేంద్రం స్వస్తి పలికిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ది కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 స్థానంలో రూపొందించిన నూతన బిల్లులో పలు కీలక సవరణలు కూడా చేసింది.
అయితే నాలుగేళ్లుగా ఈ బిల్లుకు మాత్రం మోక్షం లభించడం లేదు. పైగా గతేడాది ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసి, అర్ధంతరం నిలిపివేయడంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లుగా కంటోన్మెంట్లలో ప్రజాప్రతినిధులు లేకుండానే పాలన సాగుతూ ఉండటం విశేషం. దీంతో వీలైనంత త్వరగా కంటోన్మెంట్లకు ఎన్నికలు నిర్వహించాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 అక్టోబర్లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించి పదేండ్లు పూర్తికావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అయినా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మౌలిక సదుపాయాల కల్పన నామమాత్రమే. రక్షణ శాఖ నుంచి ప్రత్యేక నిధులు విడుదల కావు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి. కానీ.. రోడ్లు, మంచినీరు, కమ్యూనిటీ హాళ్లు తదితర సదుపాయాలకు పరిమిత స్థాయిలోనే నిధులు అందుతున్నాయి.
భద్రత పేరిట తరచూ కంటోన్మెంట్లోని పలు ప్రధాన, అంతర్గత రోడ్లను స్థానిక మిలిటరీ అధికారులు మూసివేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే లక్షలాది మంది అసౌకర్యానికి గురవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిందిగా ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. తాజా పరిణామాలతో విలీనంపై ఉన్న ఆశలు సైతం ఆవిరైపోతున్నాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మిలిటరీ స్థావరాలు ఉండటంతో పాటు ప్రజల నివాసాలు, ఖాళీ స్థలాల ఆధారంగా వివిధ కేటగిరీలుగా స్థలాలను విభజించారు.
కేటగిరీల వారీగా ఎకరాలివి..
ఏ-1 కేటగిరీలో 5,673 ఎకరాలు
ఏ-2 కేటగిరీలో 4 ఎకరాలు
బీ-1 కేటగిరీలో 417 ఎకరాలు
బీ-2 కేటగిరీలోని 2728 ఎకరాలు
బీ-3 కేటగిరీలో 486 ఎకరాలు
బీ-4 కేటగిరీలో 90 ఎకరాలు
సీ-కేటగిరీలోని 228 ఎకరాలు
ఏ-1, 2 కేటగిరీలోని భూములు ఆర్మీ వినియోగంలో ఉన్నాయి. బీ-1 కేటగిరీలోని భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. బీ-2 కేటగిరీలోని భూములు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు స్థలాలు ఉన్నాయి.
బీ-4 కేటగిరీలోని భూములు రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయి.
సీ-కేటగిరీలోని స్థలాల కంటోన్మెంట్ బోర్డుకు చెందినది. బీ-3 కేటగిరీ భూములు రక్షణ శాఖ పరిధిలో ఉంటాయి. బీ-2 కేటగిరీలోని భూముల్లో ప్రజలు నివాసముంటున్నారు. తిరుమలగిరి, మారేడ్పల్లి, అమ్ముగూడ, హకీంపేట, కార్ఖానా, బోయిన్పల్లి, రసూల్ పురా, కౌకూర్, బొల్లారం వంటి కాలనీలు ఇందులో ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,17,910 మంది ప్రజలు నివాసముండగా, ప్రస్తుతం దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు కంటోన్మెంట్ బోర్డు అంచనా.